● కలెక్టర్ స్నేహ శబరీష్
చిన్నగూడూరు: పదో తరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష సరళిని పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 45 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పరీక్షకు 8,165 మంది విద్యార్థులు హాజరు కాగా, 99.89 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అన్ని విద్యాసంస్థల్లో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
గ్రామసభలను ఘనంగా నిర్వహించాలి
మహబూబాబాద్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల గ్రామసభలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ప్రజాపాలన, తదితర విషయాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో లబ్ధిదారులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు.


