ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
కాశిబుగ్గ : వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకుని ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సాంకేతిక విద్యతో విశిష్ఠ గుర్తింపు పొందిన ఈ విద్యా సంస్థ, చిన్నస్థాయి నుంచి ప్రారంభమై నేడు మహావృక్షంగా అభివృద్ధి చెందింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు మార్గదర్శకంగా నిలిచింది.
చిన్న షెడ్డుతో మొదలై..
కళాశాల ప్రారంభంలో నగరంలోని అజంజాహి మిల్లులోని ఒక షెడ్డులో 120 మంది విద్యార్థులతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రీకల్ కోర్సులతో తరగతులు ప్రారంభమయ్యాయి. అనంతరం వరంగల్‌లోని ఎన్‌ఐటీ (ఆర్‌ఈసీ) తరగతులు కూడా తొలినాళ్లల్లో ఇదే కళాశాలలో నిర్వహించారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులుగా ఎదిగి కళాశాలకు గుర్తింపు తీసుకు వచ్చారు. బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏఎల్, జెన్‌కో, ఎన్పీడీసీసీఎల్, హెచ్‌సీఎల్, డీఆర్‌డీఓ, ఇస్రో, ఐడీపీఎల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
1995 జూలై నుంచి..
1995 జూలై 10న పదెకరాల విస్తీర్ణంలో పాలిటెక్నిక్ కళాశాల నూతన క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కళాశాలలో 1,620 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. 1995–96లో ఈసీఈ, కంప్యూటర్ కోర్సులు ప్రారంభించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కళాశాలలో ప్రవేశాలకు అధిక డిమాండ్ ఉండేది. గ్రంథాలయంలో సుమారు 25 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్ ప్రక్రియలు సైతం ఇక్కడే నిర్వహించారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే వారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఈ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు లభించడం విశేషం.
నేడు పాలిటెక్నిక్ కళాశాలలో వేడుకలు
కళాశాల ప్రాంగణంలో నేడు(ఆదివారం) ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుక వచ్చేందుకు ఈ మహా సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
నేడు 70 వసంతాల వేడుకలు


