మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈసందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఆకేరు, మున్నేరు వాగులు ఎండిపోయాయని ఉన్నతాధికారులతో మాట్లాడి ఎస్సారెస్పీ జలాలు వచ్చేలా చూడాలన్నారు. గతంలో ఎస్పారెస్పీ జలాలు విడుదల చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. పనులు చేసిన సర్పంచ్‌లకు బిల్లులు ఇప్పించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో మార్పుల వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సిబ్బంది అందుబాటులో ఉండాలి
గూడూరు: ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు 108 అంబులెన్స్ సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా మేనేజర్ బత్తిని మహేశ్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో ఏజెన్సీ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు 108 అంబులెన్స్ వాహనాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందించిన సేవల వివరాలను పరిశీలించారు. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా వాహనంలో ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకో వాలని సూచించారు. అంబులెన్స్‌లో ఉన్న మందులు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిబ్బంది హనుమంత్, ప్రశాంత్, లలిత, నాగరాజు, రామ్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థుల ఇబ్బందులు
డోర్నకల్: మున్సిపాలిటీలోని జెడ్పీహెచ్‌ఎస్ ఎదుట బురద రోడ్డుతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ ఎదుట డ్రెయినేజీ నిర్మాణం కోసం ఇరుపక్కలా రోడ్డును తవ్వారు. దీంతో భూమిలోని పైపులు పగిలి తాగునీటితో పాటు డ్రెయినేజీ మురుగునీరు రోడ్డుపైకి రావడంతో రోడ్డు బురదయమంగా మారింది. కాగా, పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హెచ్‌ఎం సోమయ్య సస్పెన్షన్
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని మోడల్ యూపీఎస్ స్కూల్ హెచ్‌ఎం సోమయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ సోమవారం తెలిపారు. సోమయ్యపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు, ఇతరుల నుంచి అందిన ఫిర్యాదు లేఖ ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల అడ్మిషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. అదేవిధంగా పాఠశాల స్కావెంజర్‌కు వేతనం అందించడంలో అవినీతి జరిగిందని రుజువైందని అన్నారు. దీంతో ఎంఈఓ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ చేశామన్నారు.


