పెండింగ్‌ దరఖాస్తులపై దృష్టిపెట్టాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ దరఖాస్తులపై దృష్టిపెట్టాలి

Mar 24 2026 8:06 AM | Updated on Mar 24 2026 8:06 AM

మహబూబాబాద్‌: ప్రజావాణి పెండింగ్‌ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, అదనపు కలెక్టర్లు లెనిన్‌ వత్సల్‌ టొప్పో, అనిల్‌కుమార్‌ వినతులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు జవాబు దారీతనంగా ఉండి సేవలందించాలన్నారు. ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. వసతి గృహాల్లో మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టల్‌ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్‌ పాయిజన్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పా రు. కాగా, ప్రజావాణిలో 146 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కొన్ని వినతులు పరిశీలిస్తే..

● మానుకోట మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామానికి చెందిన ఉప్పలయ్య తన భూమికి సంబంధించిన పాసుపుస్తకం ఇప్పించాలని వినతి అందజేశాడు.

● ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఆవుల పద్మ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని అధికారులు తెలపగానే.. ఉన్న ఇల్లు కూల్చివేసిన తర్వాత మంజూరు కాలేదని చెప్పారని, వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వినతిలో కోరింది.

● మానుకోట మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన కె.వెంకటాద్రి 2023లో జరిగిన ప్రమాదంలో కుడి కాలు, చేయి కోల్పోవడం జరిగిందని, తనకు దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని వినతిలో పేర్కొన్నాడు.

వసతి గృహాల్లో మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలి

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

ప్రజావాణిలో 146 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement