కొత్తగూడ: అధిక ధర ఆశ చూపి మొక్కజొన్న రైతులను నట్టేట ముంచారు. పాప్‌కార్న్ మొక్కజొన్న ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.. క్వింటాకు రూ.3500చెల్లించి తామే కొనుగోలు చేస్తామని సంబంధిత మొక్కజొన్న కంపెనీ ప్రతినిధులు నమ్మబలికారు. దీంతో కొంతమంది రైతులు సాగుకు ముందుకు వచ్చారు. మండలంలోని తాటివారివేంపల్లి, రౌతుగూడెం, సాదిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 50ఎకరాల్లో సాగు చేశారు. విత్తనాలు ఇచ్చిన వారి సలహాలు, సూచనల మేరకు రైతులు సాగు చేశారు. అయితే మొక్కజొన్న ఎదగకపోవడం, కంకులు వేయకపోవడంతో రైతులు ఆర్గనైసర్ కత్తుల కుమార్‌ను నిలదీశారు. ఆయన పలుమార్లు పొలాలు సందర్శించి వివిధ రకాల మందులు పిచికారీ చేయించారు. అయినా ఫలితం లేదని రైతులు తెలిపారు. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్గనైజర్ మాయ మాటలు నమ్మి మోసపోయామని రైతులు అంటున్నారు. పొలం వద్దకు రావాలని, తాము నష్టపోయామని చెప్పేందుకు ప్రయత్నం చేస్తే ఫోన్ కూడా ఎత్తడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఎదుగుదల లేని పాప్‌కార్న్ మొక్కజొన్న
ఆదుకోవాలని రైతుల వేడుకోలు


