డోర్నకల్: డోర్నకల్ మండలంలో వరి పంటలకు బయ్యారం చెరువు నుంచి నీటిని విడుదల చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కాల్వల ఫీడర్ చానళ్లు, ఓటీలు సక్రమంగా లేకపోవడంతో చెరువులకు నీరుచేరని పరిస్థితి ఉందన్నారు. ఆకేరు, పాలేరు వాగుల చెక్‌డ్యామ్‌లు గతంలో వచ్చిన వరదలకు దెబ్బతిన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో రైతులు సాగు చేసిన వరిపంటలు మరో ఇరువై రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్నాయని, ఒక తడి నీరు అవసరమన్నారు. దీనికి నీటిపారుదల శాఖమంత్రి స్పందించి బయ్యారం చెరువు నుంచి డోర్నకల్ ప్రాంతంలోని వాగులకు నీటిని వదలడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
నెహ్రూసెంటర్: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులు వాణిజ్య పంటలు పండించాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు రాములునాయక్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబునాయక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వాణిజ్య పంటలు సాగు చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో క్షణికావేశంలో గడ్డిమందుతాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తొందరపాటు నిర్ణయాలతో జీవితా లను ఆగం చేసుకోవద్దని సూచించారు. గడ్డిమందు నివారించాలని మంత్రులకు కలిసి కోరినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ సభ్యుల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. డీఏఓ సరిత, హార్టికల్చర్ అధికారి మరియన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్‌ఎంఓ జగదీశ్వర్, ఏడీఏ శ్రీనివాసరావు ఉన్నారు.


