మహబూబాబాద్: మానుకోట పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కరిస్తామని, ప్రజలు వాహనాల్లోనే చెత్త వేయాలని, రోడ్లపై వేయకూడదని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నారు. మున్సిపాలిటీలో పేరుకుపోయిన పారిశుద్ధ్య సమస్యలపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘కొరవడిన పర్యవేక్షణ!’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్ స్పందించారు. 11వ వార్డులో పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లను ఆదేశించారు. దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ దగ్గరుండి కార్మికులతో ఏ క్యాబిన్ రోడ్డు వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయించారు. భవానీగర్ తండాలో అసంపూర్తి కాల్వ వద్ద పరిసరాలను శుభ్రం చేయించారు.. పలు వార్డుల్లోనూ పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించారు. ఈమేరకు ఆయా ప్రాంతాల ప్రజలు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా కమిషనర్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వాహనాల్లో చాలా వరకు తరచూ మరమ్మతులు రావడంతో సమస్యలు వస్తున్నాయన్నారు. పారిశుద్ధ్య సమస్యను పాలకమండలి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్మికులు సక్రమంగా పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


