ఔట్‌సోర్సింగ్‌ వైపు అద్దెబస్సు డ్రైవర్లు! | - | Sakshi
Sakshi News home page

ఔట్‌సోర్సింగ్‌ వైపు అద్దెబస్సు డ్రైవర్లు!

Mar 23 2026 8:54 AM | Updated on Mar 23 2026 8:54 AM

హన్మకొండ: ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్ల నియామకాల్లో ఏజెన్సీలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉంది. ఏజెన్సీలు దళారులను నియమించుకుని అద్దెబస్సు డ్రైవర్లే లక్ష్యంగా వసూళ్ల దందా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వసూళ్ల గుట్టు తెలిసినా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అధికారుల కనుసన్నల్లోనే ఔట్‌సోర్సింగ్‌ నియామకాల దందా కొనసాగుతోందని చర్చించుకుంటున్నారు. ఆయా డిపోల్లో కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటానికి పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌లో డ్రైవర్‌ ఉద్యోగం పర్మనెంట్‌ అవుతందని ఆశ చూపుతూ దళారుల ద్వారా ఔట్‌సోర్సింగ్‌ ఎజెన్సీలు లాక్కుంటున్నాయని అద్దె బస్సు యజమానులు మొత్తుకుంటున్నారు.

తగ్గుతున్న డ్రైవర్ల అవసరం..

ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పర్యావరణ పరి రక్షణ పేరుతో విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టాయి. వాటిని విస్తరిస్తున్న క్రమంలో ఆర్టీసీలో డ్రైవర్ల అవసరం తగ్గుతోంది. ఈ క్రమంలో కొత్తగా డ్రైవర్ల నియామకాలు చేపట్టే అవకాశం లేదని, అలాంటప్పుడు పర్మనెంట్‌ పేరుతో తీసుకుంటున్న వారి పరిస్థితి ఏంటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్‌ రీజియన్‌లో ఇప్పటికే వరంగల్‌–2 డిపో 115 విద్యుత్‌ బస్సులతో జేబీఎం సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా వరంగల్‌ మహానగరానికి మరో 100 విద్యుత్‌ బస్సులు రానున్న క్రమంలో హనుమకొండ డిపోను కేటాయించడానికి యాజమాన్యం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో కొత్తగా ఆర్టీసీ సొంతంగా రెగ్యులర్‌ డ్రైవర్ల నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం ఏ మాత్రం లేదని సుస్పష్టం. మరోవైపు రాష్ట్ర రాజధానిలో సిటీ బస్సులుగా విద్యుత్‌ బస్సులు నడపనుండడంతో నగరంలోని ఆయా డిపోల్లోని డ్రైవర్లను ఇతర డిపోలకు సర్దుబాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏ రకంగా చూసినా డ్రైవర్ల రిక్రూట్‌మెంట్‌కు అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకుల అభిప్రాయం.

రూ.50వేల వరకు వసూళ్లు!

పర్మనెంట్‌ పేరుతో అద్దెబస్సు డ్రైవర్లను లాక్కుంటూ వారి నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేలకు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముందుగా డబ్బులు చెల్లించని వారి నుంచి తర్వాత ఇచ్చే జీతాల నుంచి రికవరీ చేసుకునేల ఒప్పందం చేసుకుంటున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లో ఇప్పటికే 50 మంది అద్దెబస్సు డ్రైవర్లను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు తీసుకోగా తాజాగా భూపాలపల్లి డిపో పరిధిలో నలుగురు, హనుమకొండలోని మూడు డిపోల నుంచి 36 మంది, తొర్రూరు డిపో పరిదిలో 8 మంది. పరకాల డిపో పరిఽధిలో నలుగురు, జనగామ డిపో పరిధిలో ఇద్దరు అద్దె బస్సు డ్రైవర్లను ఔ ట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు తీసుకుని ఆర్టీసీకి డ్రైవర్లుగా పంపనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని ఇతర రీజియన్లలో అద్దె బస్సు డ్రైవర్లను ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లుగా తీసుకోవద్దని అక్కడి అఽధికారులు ఆదేశాలు జారీ చేశారని, అయితే వరంగల్‌ రీజియన్‌లో ఆర్టీసీ అధికారులు మాత్రం అద్దెబస్సు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లుగా తీసుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటని అద్దెబస్సు యజమానులు ప్రశ్నిస్తున్నారు. అద్దెబస్సులు కూడా ఆర్టీసీకి సేవలందిస్తున్నాయని, ఈ క్రమంలో అద్దె బస్సు డ్రైవర్లను తీసుకుంటే అద్దె బస్సులు నిలిచిపోనున్నాయని, దీనికి ఆర్టీసీ అధికారులతే బాధ్యత అని అద్దె బస్సుల యజమానులు పేర్కొంటున్నారు.

దళారులను నియమించి

లాక్కుంటున్న ఏజెన్సీలు

పర్మనెంట్‌ అవుతుందని

ఆశ చూపుతూ వసూళ్లు

ఆర్టీసీ డిపో అధికారుల చేతి వాటం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement