ఆటోలు ఎక్కాల్సిందే..
కేసముద్రం: మండలంలోని కల్వల మోడల్ స్కూల్‌లో చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే స్కూల్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో మండలంలోని బేరువాడ, వెంకటగిరి, ఇంటికన్నె, అమీనాపురం, కేసముద్రంవిలేజ్, కేసముద్రంస్టేషన్, తాళ్లపూసపల్లి, అన్నారం, నారాయణపురం, ఇనుగుర్తి మండలం చెట్లముప్పారం, తదితర గ్రామాలు, తండాల నుంచి విద్యార్థులు డబ్బులు చెల్లించి టాటాఏస్ వాహనాలు, ఆటోల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు వాహనాల వెనుకాల నిల్చొని ప్రమాదకంగా ప్రయాణిస్తున్నారు. పైగా మోడల్‌స్కూల్‌కు వెళ్లే దారి అధ్వానంగా మారడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఒక్కో విద్యార్థి నెలకు రూ.700 నుంచి రూ.1300 వరకు ఆటో కిరాయి చెల్లించి బడికి రావాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే మండలంలోని ఆయా ఉన్నత పాఠశాలలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ వాహనాలు, సైకిళ్లపై వెళ్తున్నారు. మరికొందరు రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్తున్నారు.


