ఒకటే సర్వీసు.. 450మంది విద్యార్థులు
తొర్రూరు రూరల్: మండలంలోని గుర్తూరు మోడల్ స్కూల్ విద్యార్థులకు రవాణా కష్టాలు తప్పడం లేదు. స్కూల్‌లో 6నుంచి 12వ తరగతి వరకు 500మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 50 మంది విద్యార్థినులు హాస్టల్‌లో ఉంటున్నారు. మిగిలిన 450మంది అప్ అండ్ చేస్తున్నారు. కాగా తొర్రూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం ఒక ట్రిప్ స్పెషల్ బస్సు నడుస్తోంది. దానిలో అందరూ వెళ్లలేకపోతున్నారు. గత్యంతరం లేక తొర్రూరు నుంచి నర్సంపేటకు వెళ్లే ఇతర ఆర్టీసీ బస్సుల్లో నిల్చొని ప్ర యాణం చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. సమయానికి బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించి రాత్రి వరకు ఇంటికి వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికై నా అదనంగా బస్సు సర్వీసులు నడపాలని వారు కోరుతున్నారు.


