మున్సిపాలిటీల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు మున్సిపాలిటీల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్లమెంట్ ఇన్‌చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో మున్సిపల్ ఎన్నికలపై గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఇతర ముఖ్య నేతలు హాజరుకాగా.. ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 24న పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని నేతలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలతో మున్సిపల్ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు.


