గాడిన పడేలా..!
జీపీ ట్రాక్టర్ల మరమ్మతులకు అప్పులు చేస్తున్న కొత్త సర్పంచ్‌లు
సాక్షి, మహబూబాబాద్: నూతన సర్పంచ్‌లు పల్లె పాలనపై దృష్టిపెట్టారు. ఈమేరకు మూలనపడిన ట్రాక్టర్ల మరమ్మతులకు అప్పులు చేయడం మొదలుపెట్టారు. రెండేళ్లుగా పాలక మండళ్లు లేకపోవడం.. కొన్ని పంచాయతీల్లో నిధులు లేవని కార్యదర్శులు పట్టించకోకపోవడంతో మూలనపడిన ట్రాక్టర్లకు కొత్త సర్పంచ్‌ల రాకతో మోక్షం కలుగుతోంది. పారిశుద్ధ్యం, మొక్కలకు నీళ్లు పోయడం, ఇతర పనులను ట్రాక్టర్ల ద్వారానే చేపడుతారు. దీంతో అప్పు చేసైనా సరే జీపీ ట్రాక్టర్ల మరమ్మతు పనుల్లో సర్పంచ్‌లు నిమగ్నమయ్యారు.
నిర్వహణ లేకనే..
జిల్లాలోని 461 పంచాయతీల్లో 290మేరకు తండాలు, చిన్న చిన్న గూడేలు పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు వచ్చే రాష్ట్ర నిధులు, 15వ ప్ర ణాళిక నిధులు వర్కర్ల జీతాలు, పంచాయతీల నిర్వహణ, కరెంట్ బిల్లులు చెల్లింపునకే సరిపోతున్నా యి. మాజీ సర్పంచ్‌లు ట్రాక్టర్లకు నెలకు రూ.11వేల చొప్పున కిస్తీ చెల్లించడానికి నానా అవస్థలు పడ్డారు. చేసిన పనులకు బిల్లులు రాక.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో మాజీ సర్పంచ్‌లకు ట్రాక్టర్ల కిస్తీలు, నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు అదనపు భారంగా మారాయి. దీంతో వాటిని మూలనపెట్టారు.
రూ.లక్ష మేరకు ఖర్చు
రెండేళ్లుగా మూలనపడిన ట్రాక్టర్లను కొత్త సర్పంచ్‌లు బయటకు తీస్తున్నారు. వీటిని ట్రాక్టర్ షెడ్‌కు తీసుకెళ్తేనే మరమ్మతు భారం తెలిసి వచ్చింది. ఇంజన్‌లో.. గేర్, ఇంజన్ ఆయిల్ లేకపోవడంతో అంతా ఎండిపోయింది. ఎయిర్ ఫిల్టర్లు, బ్యాటరీ పాడయ్యాయి. సెల్ఫ్ మోటార్ తుప్పుపట్టిపోయింది. రేడియేటర్ పాడైంది. వీటన్నిటి మరమ్మతు చేయాలంటే తక్కువలో తక్కువ రూ. 50వేల మేరకు అవుతుంది. ఇక ఇంజన్, ట్యాంకర్ మరమ్మతు చేయడం, తుప్పుపట్టిన ప్రాంతాల్లో అతులుకు వేయడం, టైర్లు, రిమ్ములు వేసేందుకు మరో రూ.50వేల నుంచి రూ.70వేలకు పైగా ఖర్చు. ఇలా మొత్తం ట్రాక్టర్ మరమ్మతుకు రూ.లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని సర్పంచ్‌లు చెబుతున్నారు.
వచ్చీరాగానే అప్పులు..
పదవి చేపట్టిన వెంటనే అప్పులు చేయాల్సి వస్తోందని సర్పంచ్‌లు చెబుతున్నారు. గ్రామాల్లో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పట్టడం, ఇతర ప నులకు ట్రాక్టర్ అవసరం. అయితే ఇంతకా లం ట్రాక్టర్లను మూలన పడితే ఎవరూ అడగలేదు. కానీ ఇప్పుడు గ్రామస్తులు వచ్చి చెత్త తీయడం లేదు. కాల్వలు తీయడం లేదు. నీళ్లులేక చెట్లు ఎండిపోతున్నాయి అని ఫిర్యాదులు చేస్తున్నారని, ఈ పరిస్థితిలో గత్యంతరం లేక అప్పులు చేసి ట్రాక్టర్ల మరమ్మతు చేయిస్తున్నామని అంటున్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో శక్తికి మించి డబ్బులు ఖర్చుచేశామని, గెలిచిన తర్వాత కూడా అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో వాహనానికి రూ.లక్ష మేరకు ఖర్చు
15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయని చెబుతున్న అధికారులు
గాడిన పడేలా..!


