36 వార్డులు.. 165 దరఖాస్తులు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ పలువురు కాంగ్రెస్ పార్టీ ఆశావహులు మంగళవారం దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీరా సురేష్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 36 వార్డుల్లో 165 దరఖాస్తులు వచ్చినట్లు వారు పేర్కొన్నారు.
వన్యప్రాణి గణన షురూ..
బయ్యారం: అటవీశాఖ ఆధ్వర్యంలో మంగళవారం వన్యప్రాణి గణన ప్రారంభమైంది. ఈమేరకు మొదటిరోజు అటవీ దున్నలు, అడవి, ముళ్లపందులు ఉన్నట్లు గుర్తించారు. బయ్యారం అటవీరేంజ్ పరిధిలో ఆరురోజుల పాటు ఆయా బీట్‌ల పరిధిలో బీట్‌ఆఫీసర్లు, డీఆర్వోలు వన్యప్రాణి గణనలో భాగస్వాములవుతున్నారు.
ఆదాయం సమకూరే పంటలు సాగు చేయాలి
చిన్నగూడూరు: రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను అనుసరించి నిత్యం ఆదాయాన్ని సమకూర్చే కూరగాయల పంటలను సాగు చేయాలని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆయిల్‌పామ్ తోటలను ఆయన సందర్శించి, అంతర పంటలైన కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రోజురోజుకూ కూరగాయాల సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు. ఆధునిక పద్ధతులు పాటించి నిత్యం ఆదాయం ఇచ్చే కూరగాయల పంటల సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నారని తెలిపా రు. కూరగాయల సాగులో భాగంగా అంతరపంటలకు ఎకరానికి రూ.2,100, కూరగాయల నారు మొక్కల సరఫరాకు ఎకరానికి రూ.10వేలు ప్రభుత్వమే రాయితీ అందజేస్తుందన్నారు. రైతులు రాయితీ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
మెరుగైన విద్యుత్ సేవలపై దృష్టి
డోర్నకల్: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెరుమాళ్లసంకీస గ్రామ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో రూ.25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన లైన్ ఇన్, అవుట్ పనులను మంగళవారం ఎస్‌ఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుమాళ్ల సంకీస సబ్ స్టేషన్‌లో లైన్ ఇన్, అవుట్ ఏర్పాటుతో తొడేళ్లగూడెం, పెరుమాళ్లసంకీస, గొల్లచర్ల, మన్నెగూడెం సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. తరచూ మరమ్మతు పనుల కోసం సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా చేసే అవకాశాలు ఉంటాయని తెలిపారు. విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తూ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈలు హీరాలాల్, కోటేశ్వర్‌రావు, ఏడీఈ రమేష్, ఏఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
36 వార్డులు.. 165 దరఖాస్తులు
36 వార్డులు.. 165 దరఖాస్తులు


