‘మండమెలిగె’కు సర్వం సిద్ధం
ఎస్‌ఎస్ తాడ్వాయి : మహాజాతరలో భాగంగా మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో నేడు (బుధవారం) జరగనున్న మండమెలిగె పండుగకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు వారాలముందు గుడిమెలిగె పండుగతో తొలిఘట్టం పూజలు ప్రారంభం కాగా, సరిగ్గా వారం రోజులముందు నిర్వహించే ఈ మండమెలిగె పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం మేడారం, కన్నెపల్లి వనదేవతల ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మ పూజారులు ఆలయాలు, అమ్మవారి పూజా సామగ్రి (మువ్వలు, గంటలు, వస్త్రాలు, ఊత కొమ్ములు) శుద్ధి చేయనున్నారు. ముగ్గులతో ఆడపడుచులు సుందరంగా అలంకరిస్తారు. పూజారులు ఉదయాన్నే తలంటుస్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరిస్తారు. ఆలయాల్లో ప్రత్యేకంగా ధూపదీపాలు వెలిగించి ఆచారసంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు.
మేడారం అష్ట దిగ్బంధం..
మండమెలిగె పండుగ సందర్భంగా పూజారులు మేడారాన్ని బుధవారం అష్ట దిగ్బంధం చేయనున్నారు. ముందుగా నిష్టతో నులకతాడు తయారు చేసి దానికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో అమ్మవార్లను తీసుకువచ్చే ప్రధాన రహదారుల వద్ద బూర్కకర్ర(ముళ్లతో కూడుకున్న పచ్చికర్రలు)లకు మామిడి తోరణాలు కట్టి నిలుపుతారు. ఎలాంటి దుష్టశక్తుల చూపు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని పూజారులు ఆనవాయితీగా నిర్వహించనున్నారు.
ప్రతీ ఇంటా పండుగే..
పూజారుల కుటుంబాలు, స్థానిక ఆదివాసీలు, గ్రామస్తులు ఆలయాలను దర్శించుకొని ఇళ్లలో కూడా పండుగ నిర్వహించుకోనున్నారు. కాగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయంనుంచి మధ్యాహ్నం వరకు మండమెలిగె పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం అర్ధరాత్రి సమ్మక్క పూజారులు ఆలయం నుంచి అమ్మవారి పూజాసామగ్రి, వస్త్రాలను తీసుకొని గద్దెల వద్దకు వెళ్లనున్నారు. సమ్మక్క గద్దెను అలికి ముగ్గులు వేసి పూజా సామగ్రిని గద్దైపె ఉంచి రాత్రంతా డోలు వాయిద్యాల నడుమ జాగారం నిర్వహిస్తారు. గురువారం ఉదయం సమ్మక్క గద్దెలపై ఉంచి అమ్మవారి వస్త్రాలను తీసుకొని సమ్మక్క పూజారులు గుడికి తిరుగుప్రయాణమవుతారు. అనంతరం అమ్మవారికి మరోసారి పూజలు నిర్వహించి యాట మొక్కు చెల్లిస్తారు. సారలమ్మ పూజారులు కూడా ఇలాగే గద్దెనుంచి కన్నెపల్లిలోని అమ్మవారి గుడికి చేరుకుంటారు. అక్కడా మళ్లీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గుడిమెలిగె పండుగ ఒక్కరోజుతో ముగిస్తే.. మండమెలిగె పూజా కార్యక్రమాలు మాత్రం రెండు రోజులపాటు జరగడం విశేషం.
నేడు మేడారం దిగ్బంధం
భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు


