‘బంగారం’ వచ్చేస్తోంది!
గీసుకొండ : మేడారం వన దేవతలు సమ్మక్క, సారమ్మకు భక్తులు నైవేద్యంగా సమర్పించే ‘బంగారం’( బెల్లం) నిల్వలను వ్యాపారులు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వ్యాపారులు పలు రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి బెల్లం తెప్పించి అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో వరంగల్ పాతబీట్ బజారు ప్రాంతంలో సుమారు 10 బెల్లం విక్రయించే హోల్ సేల్ షాపులు ఉండగా కొత్తగా మరి కొన్ని వెలుస్తున్నాయి. అలాగే, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, హనుమకొండ జిల్లాలోని వ్యాపారులు సైతం మహాజాతరకు బెల్లం రెడీ చేస్తున్నారు.
పావు కిలో నుంచి 10 కిలోల వరకు..
మార్కెట్‌లో బెల్లం పావు , అర కిలో, కిలో, ఐదు, పది కిలోల చొ ప్పన లభిస్తున్నాయి. పది కిలో లకు మించి బెల్లం బుట్టలు ఉండవని వ్యాపారులు చెబుతున్నారు. కిలో బెల్లం ధర రూ. 40 నుంచి రూ.70 వరకు నాణ్యత, దిగుమతి చేసుకునే ప్రాంతం, దూరం ఆధారంగా ఉంటుందంటున్నారు. కస్తూరి రకం అధిక నాణ్యమైందని, కిలో రూ. 66 నుంచి రూ. 70 వరకు ధర పలుకుతోందని తెలిపారు.
సమ్మక్క పున్నంతో ఇంటింటా పూజలు
ఈ నెల 3వ తేదీన సమ్మక్క పున్నం ప్రారంభమైంది. ఈ నెల నుంచి ఫిబ్రవరి 1న రానున్న పౌర్ణమి వరకు భక్తులు ఇంటింటా సమ్మక్క పూజలు చేస్తారు. ముఖ్యంగా బుధ, గురు, శుక్ర వారాల్లో పల్లెల్లో సమ్మక్క పూజల సందడి కనిపిస్తుంది. ఆ రోజుల్లో వీలు కాని వారు ఆదివారం చేస్తారు. ఇంటి వద్ద పూజలు చేసిన తర్వాతే జాతరకు వెళ్లడం ఆనవాయితీ. ఈ పూజల్లో ఎత్తు బెల్లం అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో వనదేవతల పూజల్లో బెల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. బరువు ఎక్కువగా ఉన్న వారు అమ్మవార్లకు కొంత బెల్లంతో పాటు పంచదార(చక్కెర)ను కూడా నైవేద్యంగా అందిస్తున్నారు. చక్కెర కిలో ధర ప్రస్తుతం రూ. 40 ఉంది. గతంలో రూ. రెండు ఎక్కువ ఉన్నా ఇటీవల తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధ, గురు, శుక్ర వారాల్లో ..అంటే జనవరి 28, 29, 30 తేదీల్లో అమ్మవార్ల జాతర నిర్వహిస్తారు. జాతరలో భక్తులు వేల టన్నులు బెలాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించనున్నారు.
దిగుమతి చేసుకునే రకం.. కిలో బెల్లం ధర
మహారాష్ట్ర నాందేడ్ రకం రూ. 40
మహారాష్ట్ర పుణె రకం రూ. 42
కర్ణాటక కోలాపూర్ రకం రూ. 48
కర్ణాటక కస్తూరి రకం రూ. 66
మేడారం మహాజాతరకు
దిగుమతి అవుతున్న బెల్లం
పలు రాష్ట్రాల నుంచి వేల టన్నుల సరుకు తెప్పిస్తున్న వ్యాపారులు


