దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
బచ్చన్నపేట : అయ్యప్ప మాల విరమణ అనంతరం దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా కారు టైరు పగిలి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలీంపూర్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలానికి చెందిన సమ్మెట మహేశ్ (32) బైక్ మెకానిక్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేశ్, కొడకండ్లకు చెందిన అందె యాకయ్య అయ్యప్ప మాల ధరించారు. డిసెంబర్ 30న ఇద్దరూ శబరికి వెళ్లి మాల విరమణ చేసి మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. అనంతరం మరో పుణ్య క్షేత్రం వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. దీంతో మృతుడు మహేశ్‌తోపాటు భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు, అతడి స్నేహితుడు అందె యాకయ్య, భార్య మంజుల, కూతురు, అతడి చెల్లి.. కారులో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి పుణ్య క్షేత్రానికి వెళ్లారు. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యాకయ్య కారు నడుపుతుండగా మహేశ్ పక్కన కూర్చున్నాడు. ఈ క్రమంలో అలీంపూర్ గ్రామం దాటగానే కారు టైరు పగిలి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పక్కన కూర్చున్న మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగతా వారికి గాయాలుకాగా 108లో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మహేశ్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కారు బోల్తాపడి యువకుడి దుర్మరణం
అయ్యప్ప మాల విరమణ రోజే మృతి..
దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..


