నేడు జిల్లా మంత్రుల సమీక్ష
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.
ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరి
కేసముద్రం: ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని జిల్లా రవాణా అధికారి జయపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం కేసముద్రంస్టేషన్ జెడ్పీ హైస్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలో రోడ్డు భద్రతా వారో త్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుమీద ప్రయాణం చేసేటప్పుడు మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయొద్దని తెలిపారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా అంశాలపై క్విజ్ పోటీలు ఏర్పాటు చేశారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాజు, కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ఆర్టీఏ డైరెక్టర్ రావుల మురళీ పాల్గొన్నారు.
ముద్ర లోన్ పేరిట సైబర్ మోసం
డోర్నకల్: మండలంలోని తహసీల్దార్ బంజర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్లకు చిక్కి డబ్బు కోల్పోయాడు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. తహసీల్దార్ బంజర గ్రామానికి చెందిన చెవిటి రాముకు గుర్తు తెలియని వ్యక్తులు ముద్ర లోన్ ఇప్పిస్తామంటూ గత నవంబర్ నుంచి విడతలవారీగా రూ.96,000 తమ అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నారు. కానీ, రుణం ఇవ్వకపోవడంతో తాను మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన రాము మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సైబర్ నేరగాళ్ల అకౌంట్‌లోని రూ.16,000 నగదును హోల్డ్‌లో పెట్టారు. రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి
మహబూబాబాద్ అర్బన్: పదో విద్యార్థులు తత్కాల్ స్కీమ్ కింద ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు అపరాధ రుసుం రూ.వేయితో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈఓ రాజేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా ఏసీజీఈ మందుల శ్రీరాములును 98497 61012 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.
జిల్లాలో బాల్యవివాహాలను నియంత్రించాలి
మహబూబాబాద్ అర్బన్: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘బాల్య వివాహరహిత భారతదేశం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా చేయాలని న్యాయ సేవా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజుకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగఽవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజుకృష్ణ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాలికలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు పూర్తయితేనే వివాహం జరిపించాలని తెలిపారు. బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098 కు కాల్ చేసిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇతర న్యాయ సలహాలు సహాయంకోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ఫోక్స్ తదితరలపై రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శంచారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పొడుగు నర్సయ్య, హాస్టల్ వార్డెన్ పద్మ, ఉపాధ్యాయులు చిట్టిబాబు, హరికృష్ణ పాల్గొన్నారు.
నేడు జిల్లా మంత్రుల సమీక్ష


