ధాన్యం రాశులు
సాక్షి, మహబూబాబాద్: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అయితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సివిల్ సప్లయీస్‌లోని పలువురు అ ధికారులు, కొన్ని రైస్ మిల్లుల యజమానుల మధ్య సమస్వయంతో రైతులను మోసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సకాలంలో కాంటాలు పెట్టకపోవడం, కాంటాలు పెట్టిన ధాన్యం రవాణా చేయకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉంచడం, కాంటాల్లో మోసం.. తరుగు పేరుతో డబ్బుల్లో కోత పెట్టిన విషయంపై రైతులు ఆందోళన చేయడం, కొనుగో లు కేంద్రాల్లో జాప్యం మూలంగా మరిపెడ మండలంలో రైతులు మృతి చెందిన సందర్భాలు ఉన్నా యి. వీటిని అధిగమించేందుకు కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సివిల్ సప్లయీస్, ఐకేపీ, పీఏసీఎస్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ట్రాన్స్‌ఫోర్ట్ వాహనాలు సక్రమంగా పెట్టకుంటే క్రిమినల్ కేసులు పెట్టే విధంగా వారితో అగ్రిమెంట్స్ రాయించుకున్నారు. ట్రాన్స్‌ఫోర్ట్ అధికారుల ను భాగస్వామ్యులను చేసి కాంటా పెట్టిన వెంటనే ధాన్యం మిల్లులకు తరలించేలా చూశారు.
2.12 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోళ్లు
గతంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు లక్ష్యంలో సగం ధాన్యం కూడా రాని సందర్భాలున్నాయి. కానీ, ఈ వానాకాలంలో ఇప్పటి వరకే 2.12 లక్షలకు మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. వానాకాలం 8,097 ఎకరాల దొడ్డురకం, 2,15,782 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. దీంతో 17,607 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 4,47,878 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో రైతుల నిల్వ, ఇతర మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు పోగా 17,383 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 2,71,967 మెట్రిక్ టన్నుల సన్నరకం మొత్తం 2,89,350 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావించారు. అయితే ఇప్పటి వరకు 2.12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. మరో 30 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రికార్డు స్థాయిలో వానాకాలం ధాన్యం దిగుబడి
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం
కాంటాలు పెట్టిన వెంటనే మిల్లులకు తరలింపు


