మున్సిపాలిటీ వద్దు.. గ్రామపంచాయతీ ముద్దు
● గాంధీ సెంటర్‌లో మహిళల ధర్నా
● మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తామంటూ ఆందోళన
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక గాంధీ సెంటర్లో మహిళలు ధర్నా నిర్వహించారు. బంకట్‌సింగ్ తండా, ఎర్రమట్టి తండా, సిగ్నల్ తండాకు చెందిన గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో గాంధీ సెంటర్‌కు చేరుకుని రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. డోర్నకల్ మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత తాము ఉపాధి హామీ పనులకు దూరమయ్యామని, ఇంటి పన్నులు, పారిశుద్ధ్య సమస్యలు పెరిగాయని, అభివృద్ధికి దూరంగా మున్సిపాలిటీ మారిందంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే డోర్నకల్‌ను గ్రామపంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ నాలుగు గంటలపాటు రోడ్డుపై బైటాయించారు. తమ డిమాండ్ అమలు కాకపోతే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఎస్సై గడ్డం ఉమ, కాంగ్రెస్ నాయకులు మాదా శ్రీనివాస్, శీలం శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు మన్యుపాట్ని తదితరులు మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన కొనసాగించడంతో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగిన తర్వాత కమిషనర్ నిరంజన్‌తోపాటు కాంగ్రెస్ నాయకుల అభ్యర్థన మేరకు కమిషనర్‌కు వినతిపత్రం అందించి ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాలనే డిమాండ్ రావడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది.
మున్సిపాలిటీ వద్దు.. గ్రామపంచాయతీ ముద్దు


