బ్యాంకుల సహకారంతో నేరాల నియంత్రణ
మహబూబాబాద్ రూరల్ : ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, క్యూఆర్ కోడ్ మోసాలు, ఆన్‌లైన్ లోన్, తక్షణ రుణాలపేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ శబరీష్ సూచించారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఏటీఎం భద్రత, బ్యాంకు సెక్యూరిటీ, కస్టమర్లకు అవగాహన అంశాలపై మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ సమావేశ మందిరంలో బ్యాంకు మేనేజర్లు, సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ ప్రొఫైల్స్ తయారీ, పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా, బ్యాంకులు, పోలీసు శాఖ మధ్య సమన్వయంతో సమాచారం పంచుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులపై నిఘా, సున్నితమైన లావాదేవీల పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన వెంటనే సంబంధిత ఖాతాలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏటీఎం సెంటర్ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏటీఎం వద్ద సరిపడా లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే డోర్ లాకింగ్ సిస్టమ్, ఫైళ్ల భద్రత, బ్యాంకు లోపలి సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. బ్యాంకు సెక్యూరిటీ గార్డులు, సిబ్బందికి భద్రతా విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. బ్యాంకు పని వేళలు ముగిసిన తర్వాత కూడా సెక్యూరిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమావేశంలో అడ్మిన్ డీఎస్పీ గండ్రతి మోహన్, మానుకోట డీఎస్పీ తిరుపతిరావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ నరేందర్, రూరల్, బయ్యారం సీఐలు సరవయ్య, రవికుమార్ పాల్గొన్నారు.
ఎస్పీ డాక్టర్ శబరీష్


