అభ్యంతరాలు పరిష్కరిస్తాం
● మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్
మహబూబాబాద్: ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం రాజకీయ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించారు. ఒక వార్డు ఓటర్లు వేర్వేరు వార్డుల్లో ఉన్నారని, పోటీ చేసే అభ్యర్థి పట్టణమంతా ఓటర్ల కోసం తిరిగే విధంగా ఉందని, సవరణ చేయాలని రాజకీయ పార్టీల నాయకులు కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఈసీఐ నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేస్తున్నామన్నారు. జాబితాపై వచ్చిన అభ్యంతరాలు అన్ని విధాలా పరిశీలించి ఎవరికి అన్యాయం జరగకుండా.. తుది జాబితా తయారు చేస్తామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు అన్ని విధాలా సహకరించాలన్నారు. ప్రతీ పార్టీ నుంచి ఇద్దరు నాయకులకు మాత్రమే అవకాశం కల్పించారు. సమావేశంలోటీపీఓ సాయిరాం, టీపీఎస్ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనపురం అంజయ్య, సురేష్, బీఆర్‌ఎస్ నుంచి మార్నేని వెంకన్న, సీపీఐ నుంచి అజయ్‌సారథిరెడ్డి, పెరుగు కుమార్, సీపీఎం నుంచి సూర్నపు సోమయ్య, బీజేపీ నుంచి శ్యాసుందర్ శర్మ, టీడీపీ నుంచి బొమ్మ వెంకటేశ్వర్లు, రాము పాల్గొన్నారు.


