‘పది’లో లక్ష్యం చేరేనా?
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో గత ఏడాది జిల్లా రాష్ట్రంలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ ఏడాది కూడా మొదటి స్థానం సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే ఉత్తమ ఫలి తాలే లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ, కార్యాచరణతో ముందుకు సాగాల్సిన సమయంలో డీఈఓ నిర్లక్ష్యం వల్ల సరైన ప్రణాళిక లేకపోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పాఠశాలల సందర్శన, ప్రత్యేక తనిఖీలు లేవని చెప్పకనే చెబుతున్నారు. ఇది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
గతంలో ఇలా..
పదో తరగతిలో ఫలితాల్లో 2022–23 విద్యాసంవత్సరంలో జిల్లా 20వ స్థానంలో నిలిచింది. 2023–24లో 12వ స్థానం లభించింది. 2024–25 విద్యాసంవత్సరంలో మొదటి స్థానం నిలిచింది. 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లా ఎన్నో స్థానంలో ఉంటుందో అని విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. కాగా, జనవరి మాసం రావడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు పరీక్షల ఫీవర్ మొదలైంది. వార్షిక పరీక్షలు మార్చి 14నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కఠిన పరీక్షలు ఎదుర్కొవాల్సిన పరి స్థితి నెలకొంది.
4,501 మంది విద్యార్థులు..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4,501 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారు. ఈమేరకు విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు సాయత్రం విద్యార్థులకు సబ్జెక్ట్‌ల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అల్పాహారం అమలు చేయడం లేదు. ఈ విషయంలో ఇటు ప్రభుత్వంతో పాటు అటు విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కడుపునిండా ఆహారం, కంటినిండా నిద్రలేకపోతే పది ఫలితాల్లో ప్రథమ స్థానం ఎలా సాధ్యమవుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది టెన్త్ ఫలితాల్లో
జిల్లా నంబర్‌వన్
ఉపాధ్యాయులకు పరీక్షల ఫీవర్
మార్చి 14నుంచి ఎగ్జామ్స్
విద్యార్థులకు అల్పాహారం
అందించడంలో నిర్లక్ష్యం
ప్రణాళిక ఉంటేనే సాధ్యం
గతంలో డీఈఓ, కోఆర్డినేటర్లు, ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ ఐక్యంగా కష్టపడి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దేది. ప్రణాళిక సిద్ధం చేసుకొని చదువులో వెనుకబడిని విద్యార్థులను దత్తత తీసుకొని ప్రత్యేక కార్యాచరణతో ముందుగు సాగినం. పరీక్షలకు చాలా సమయం ఉంది. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తే వారిలో మార్పు వస్తుంది. మళ్లీ మొదటిస్థానం సాధ్యమవుతుంది.
–సంకా బద్రినారాయణ, రేవా జిల్లా అధ్యక్షుడు
ఉత్తీర్ణతశాతం పెంపునకు కృషి
విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. గత సంవత్సరం కన్నా ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నాం.
–వి.రాజేశ్వర్, డీఈఓ
‘పది’లో లక్ష్యం చేరేనా?
‘పది’లో లక్ష్యం చేరేనా?


