పంచాయతీల్లో కో–ఆప్షన్ సందడి
● అవకాశం కోసం పలువురి యత్నాలు
● పల్లెల్లో మొదలైన చర్చలు
● గ్రామాల అభివృద్ధికి పాటుపడే వారికి అవకాశం
తొర్రూరు: పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామ పంచాయతీల్లో తిరిగి రాజకీయ సందడి ఊపందుకుంది. ప్రతీ గ్రామ పంచాయతీ పాలకవర్గంలో అదనంగా మరో ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులను నియమించాలి. సాధారణంగా మున్సిపాలిటీలు, మండల పరిషత్‌ల్లో మైనార్టీలకు ఈ పదవులు దక్కుతాయి. గ్రామ పంచాయతీల్లో నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. పంచాయతీల అభివృద్ధికి మార్గదర్శకంగా సూచనలు, సలహాలు ఇచ్చే వారిని నియమించాల్సి ఉంది.
వారి పాత్ర ఇలా..
కో–ఆప్షన్ సభ్యులకు గ్రామ సభల్లోనూ, పంచాయతీ సమావేశాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్డు సభ్యులతో సమానంగా ప్రొటోకాల్ ఉంటుంది. గ్రామాభివృద్ధికి సంబంధించి వీరిచ్చే సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఏదైనా అంశంపై తీర్మానం చేసేటప్పుడు ఓటు వేసే అధికారం ఉండదు. కేవలం పంచాయతీలకు సలహాదారులుగా వ్యవహరిస్తారు. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించి ప్రణాళికల రూపకల్పనలో వీరి పాత్ర కీలకం కానుంది.
ఎంపిక..
గ్రామ పంచాయతీల పాలకవర్గంతో పాటు సమాన హోదా ఉండే కో–ఆప్షన్ సభ్యుల ఎంపికపై గ్రామాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. సభ్యుల్లో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, జీఓలు, పాలనాపరమైన అంశాలపై పట్టు ఉన్న ఒక విశ్రాంత ఉద్యోగిని సభ్యుడిగా ఎంపిక చేయాలి. మరొకరు పంచాయతీ అభివృద్ధికి పాటుపడిన వారు, భారీగా విరాళాలిచ్చిన దాతలు లేదా గ్రామాభివృద్ధికి తోడ్పడే ఎన్నారైలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరి ఎంపికలో సర్పంచ్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం కీలకం కావడంతో పదవిని ఆశించే కొంత మంది ఆశావహులు అప్పుడే గ్రామాల్లో ముమ్మరంగా మంతనాలు ప్రారంభించారు. కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు సైతం తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆదేశాలు రాగానే ఎంపిక చేస్తాం
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే గ్రామ పంచాయతీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎంపికను పూర్తి చేస్తాం. పంచాయతీ చట్టంలో ముగ్గురు కో–ఆప్షన్ సభ్యుల ఎంపికను పొందుపర్చారు.
– హరిప్రసాద్, డీపీఓ
జిల్లా సమాచారం
మండలాలు– 18 పంచాయతీలు–482
కో ఆప్షన్ సభ్యుల సంఖ్య–1,446
పంచాయతీల్లో కో–ఆప్షన్ సందడి


