సత్వరమే దరఖాస్తులు పరిష్కరించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
● ప్రజావాణిలో 72 వినతులు అందజేత
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూ డా వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం సాధ్యం కానివి నివేదిక రూపంలో అందజేయాలన్నారు. 72 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
కొన్ని వినతులు పరిశీలిస్తే..
● మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సుమలత తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని వినతి ఇచ్చారు. అలాగే మానుకోట పట్టణంలోని జగ్జీవన్‌రావు నగర్ కాలనీకి చెందిన కల్యాణి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతిలో కోరారు.
● సీరోలు మండలం కాంపల్లి గ్రామానికి చెందిన బి.ప్రవీణ్ పట్టాదారు పాసుపుస్తకాల విషయంలో తనను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, పట్టాలు ఇప్పించాలని వినతి అందజేశాడు.
● గూడూరు మండలం నాయక్‌పల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు స్రవంతి తనకు దివ్యాంగ పింఛన్ రావడం లేదని, మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.


