ఇప్పుడే ఇలా.. మహా జాతరకెలా?
మేడారం తల్లుల దర్శనం కోసం వస్తున్న భక్తులు
ములుగు రూరల్/ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం మహా జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులతో దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. భక్తుల తిరుగు ప్రయాణంలో మల్లంపల్లి జాతీయ రహదారిపై ఉన్న కెనాల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాదారులు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. జాతర సమయానికి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తేనే భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి. కాగా, ఇప్పుడే ట్రాఫిక్ ఇలా స్తంభించిపోతే.. మహా జాతరనాటికి పరిస్థితి ఎలా ఉంటుంది అని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, పోలీసులు మేడారం పరిసరాల్లో వాహనాలను దారి మళ్లించడంతో కొత్తగా మేడారానికి వచ్చిన భక్తులు దారి తెలియక ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రం నుంచి మంత్రుల కవరేజ్ కోసం వచ్చిన మీడియా బృందాన్ని కూడా పోలీసులు నార్లాపూర్ చెక్ పోస్టు నుంచి అనుమతించకుండా కాల్వపల్లి మీదుగా మేడారానికి పంపించారు. దర్శనానికి ఒకే వరుసలో క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో మొక్కులు చెల్లించేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయమై ఓ భక్తుడు అక్కడే ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని యత్నించగా అతడిని పోలీసులు లాక్కెళ్లారు.
ఇప్పుడే ఇలా.. మహా జాతరకెలా?
ఇప్పుడే ఇలా.. మహా జాతరకెలా?


