చనిపోయి ఐదుగురికి పునర్జన్మ
కాజీపేట: తాను మరణిస్తూ.. ఐదుగురికి అవయవ దానం చేసి పునర్జన్మనిచ్చాడు మర్రి రమేశ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన మర్రి రమేశ్ (43) అనే రైల్వే ఉద్యోగి గత నెల 22న విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు కిందపడగా బ్రెయిన్ డెడ్ అయ్యింది. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యుల సూచన మేరకు భార్య రత్నకుమారితోపాటు కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవయవదానం చేశారు. మృతుడి గుండె, రెండు కిడ్నీలు, రెండు నేత్రాలను దానం చేయడంతో ఐదుగురికి పునర్జన్మనిచ్చినట్లయ్యింది. ఆదివారం ప్రశాంత్‌నగర్ కాలనీలో మర్రి రమేశ్ సంస్మరణ సభ నిర్వహించారు. తెలంగాణ నేత్ర అవయవదాన శరీర దాతల అసోసియేషన్ అధ్యక్షుడు కె.మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


