నర్సింగ్ విద్యార్థుల గోస..
నెహ్రూసెంటర్: ప్రభుత్వ నర్సింగ్‌కళాశాల విద్యార్థులు సరిపడా బిల్డింగ్, సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. 2022లో ప్రారంభమైన నర్సింగ్ కళాశాలలో నాలుగు బ్యాచ్‌లకు చెందిన 240 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా, సొంత భవనం లేకపోవడంతో ల్యాబ్, పరీక్షలు, చదువుల కోసం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ బిల్డింగ్ సరిపడకపోవడంతో బయట కిరాయి బిల్డింగ్‌లో ఉంటూ కిరాయి విద్యార్థులే చెల్లిస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బిల్డింగ్, సౌకర్యాల విషయమై ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
240 మంది విద్యార్థులు.. రెండు గదులు
కళాశాలలో 240 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ వంటి సౌకర్యాలు లేవని తెలుస్తోంది. రెండు గదులతో కళాశాలను నడపాల్సి వస్తుంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో బిల్డింగ్ కేటాయిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కేటా యించలేదని విద్యార్థులు తెలుపుతున్నారు. కింద కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
విద్యార్థుల ఆందోళన..
తాము చదువుకునేందుకు సరిపడా బిల్డింగ్, సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా మని కళాశాల విద్యార్థులు శనివారం కళాశాల ఆవరణ, కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టర్, అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా సమస్య పరిష్కరించడం లేదని.. పరీక్షలు దగ్గరపడుతున్నా ల్యాబ్ సౌకర్యం వంటివి లేవని, పరీక్షలు ఎలా రాయాలంటూ విద్యార్థులు ప్రశ్నించారు. నర్సింగ్ కళాశాలకు కేటాయించిన బిల్డింగ్‌ను మెడిసిన్ విద్యార్థులకు అప్పగించారని, తమకు కూడా బిల్డింగ్, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కరమయ్యేంత వరకు నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.
సరిపోని భవనం, గదులు
హాస్టల్ బిల్డింగ్ లేక కిరాయికి ఉంటున్న విద్యార్థులు
ల్యాబ్, పరీక్షలకు తప్పని ఇబ్బందులు
భవనం కేటాయించాలని ఆందోళన


