రుచికరమైన భోజనాలు వండాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనాలు వండాలని డీఈఓ వి.రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆదివారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మధ్యాహ్నం వంటలు వండే చోట పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తాజా కూరగాయలతో నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ఎక్కడైన లోపాల ఉంటే ఆ పాఠశాల కార్మికులపై చర్యలు తీసుకుంటా మన్నారు. వంటల పోటీల్లో కురవి మండలంలోని నేరడ మోడల్‌స్కూల్ ప్రథమ బహుమతి, కేసముద్రం జెడ్పీహెచ్‌ఎస్ ద్వితీయ స్థానం, మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాల తృతీయస్థానం సాధించిందన్నారు. వారికి బహుమతులు అందజేశారు. ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్‌ఎం సిరినాయక్, మధ్యాహ్న భోజన జిల్లా ఇన్‌చార్జ్ గణేష్, న్యూట్రిషన్ నిపుణులు శ్రీనివాస్, దీప్తీ, రవీందర్ నాయక్ పాల్గొన్నారు.


