అర్చక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ కల్చరల్: అర్చక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు శనివారం హనుమకొండ హరిత హోటల్‌కు చేరిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎస్. హరీశ్, ఆగమ సలహాదారు గోవింద హరిని గంగు ఉపేంద్రశర్మ కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. జీఓ 121 రద్దుతో సుమారు వెయ్యి మంది తాత్కాలిక దినసరి అర్చక ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులను రెగ్యులర్ చేసే అవకాశం లభిస్తుందన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు పొందుతున్న అర్చకులకు మూడు నెలల జీతాలు రాలేదని తెలుపగా.. డైరెక్టర్ హరీశ్ స్పందించి వేతనాలు వెంటనే అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హామీ ఇచ్చినట్లు ఉపేంద్రశర్మ తెలిపారు. రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీ శర్మ, ఇతర అర్చక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ


