ఆకట్టుకున్న కథానాటిక పోటీలు
హన్మకొండ అర్బన్ : వరంగల్‌లో అజో విభో కందాళం, సహృదయ సాహిత్య–సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్న 33వ సాహితీ–సాంస్కృతిక సదస్సు, కథానాటిక పోటీలు శని వారం మూడో రోజూ కొనసాగాయి. కార్యక్రమాల్లో భాగంగా సాహితీవేత్త విహారి అధ్యక్షతన హనుమ కొండలోని శ్రీహర్ష కన్వెన్షన్‌లో ఉదయం రామాచంద్రమౌళి కృషి సమాలోచన సదస్సు, సాయంత్రం హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నాటిక పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా రామాచంద్రమౌళి కథల్లోని విభిన్నత, కవిత్వం, తదితర అంశాలపై జగన్నాథ శర్మ, శివరామప్రసాద్, విజయకుమార్, లకీష్మ్‌కాంతారావు, రమాదేవి, సంతోష్‌కుమార్, అనిల్ ప్రసాద్ తదితర వక్తలు విశ్లేషించారు. కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన కథానాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముందుగా శార్వాణి గిరిజన సాంస్కృతిక కళాక్షేత్రం శ్రీకాకుళం బృందం ప్రదర్శించిన ‘మాయాజాలం’ నాటిక తుపానుతో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథి, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ అనుమాండ్ల భూమయ్య, ఆత్మీయ అతిథి అత్తలూరి సత్యనారాయణ, అంపశయ్య నవీన్ మాట్లాడుతూ సాహిత్యం, నాటకాలను సమన్వయం చేస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న అజో విభో, సహృదయ సంస్థల సేవలను ప్రశంసించారు. కాగా, స్వర్ణ సూర్య డ్రామా లవర్స్, ఉదయ్ భాగవతుల దర్శకత్వంలో ప్రదర్శించిన ‘శ్రీ మాత్రే నమః’ నాటిక కుటుంబ నిర్వహణలో మహిళ కష్టాలను ఆవిష్కరించింది. చివరిగా శ్రీ రమణ కళానిలయం గుంటూరు నాగేశ్వరరావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మాతృత్వం’ నాటిక తల్లి ఆవేదనను అద్భుతంగా చూపించారు.
సాహిత్య సంస్కృతి
భావి తరాలకు తెలియాలి..
హన్మకొండ కల్చరల్: సాహిత్య సంస్కృతి భావితరాలకు తెలియాలని అజో విభో కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజ్యోసుల సత్యనారాయణ అన్నారు. అజో విభో కందాళం ఫౌండేషన్, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న సాహిత్య సాంస్కృతిక సదస్సులో భాగంగా శనివారం వెలువోలు నాగరాజ్యలక్ష్మి రచించిన అప్పాజ్యోసుల సత్యనారాయణ విరచిత పంచవటి పద్యకృతి పుస్తకావిష్కరణ, వరంగల్‌కు చెందిన కవి రామా చంద్రమౌళి కృషి సమాలోచన అంశంపై సదస్సు జరగగా సత్యనారాయణ మాట్లాడారు.


