మహిళపై బీఆర్‌ఎస్ కార్యకర్త దాడి..
కురవి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదనే కోపం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి నృత్యం చేసిందనే కారణంతో ఓ బీఆర్‌ఎస్ కార్యకర్త.. మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన సదరు మహిళ బానోత్ బుల్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. కురవి మండలం బలపాల శివారు లింగ్యాతండా(బీ) గ్రామంలో వార్డు సభ్యుడి స్థానానికి మాలోత్ మోహన్ బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అయితే అదే వార్డులో ఉండే బుల్లి.. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించగా ఆ పార్టీ వారితో కలిసి నృత్యం చేసిందనే కోపంతో మోహన్.. ఆమైపె దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై బుల్లి గ్రామ పెద్దలకు చెప్పడంతో మోహన్‌ను పంచాయితీకి పిలిచినా రావడంలేదు. మళ్లీ బుల్లి పొలంలో పనిచేస్తున్న సమయంలో మోహన్ మరోసారి కొట్టడంతో మనస్తాపానికి గురై శుక్రవారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే మహబూబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బుల్లి ఫిర్యాదు మేరకు మోహన్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. కాగా, బుల్లిని కాంగ్రెస్ నాయకుడు, సర్పంచ్ స్వరూప భర్త హరిలాల్ పరామర్శించారు.
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
ఒకరిపై కేసు నమోదు


