ఆకట్టుకుంటున్న సాంస్కృతిక సదస్సులు
హన్మకొండ అర్బన్ /హన్మకొండ కల్చరల్ : నగరంలోని కాళోజీ కళాక్షేత్రం వేదికగా అజో విభో కందాళం, సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న సాహితీ–సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా కంటే ముందు సామాన్యులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించి, నేటి సమాజంలోని స్థితిగతులను విశ్లేషించి కళాత్మకంగా అందజేస్తున్నది రంగస్థల నాటకమేనని అజో విభొ కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అప్పాజ్యోసుల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం కోట్ల హనుమంతరావు కృషి సమాలోచన సదస్సు నిర్వహించారు. బీహెచ్. పద్మప్రియ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నటుడు, దర్శకుడు, అధ్యాపకుడిగా కోట్ల హనుమంతరావు ప్రస్థానంపై విశ్లేషణ జరిగింది. అనంతరం అలనాటి నాటక ప్రస్థానం–మేటి నటులు శ్రవ్య, దృశ్య కళారూప ప్రదర్శనను కందిమల్ల సాంబశివరావు ప్రదర్శించారు. సాయంత్రం కాళోజీ కళాక్షేత్రంలో జరిగిన నాటికల ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అభినయ ఆర్ట్స్, గుంటూరు వారి ‘సమయం’ నాటిక సమయ విలువను కుటుంబ నేపథ్యంతో ప్రభావవంతంగా ఆవిష్కరించింది. సభా కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న తడకమళ్ల రామచంద్రరావు నాటకం ఒక జీవ కళ అని, సమాజానికి దర్పణంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ విశిష్ట రంగస్థలం పురస్కారాన్ని కోట్ల హనుమంతరావుకి అందజేశారు. అనంతరం హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘చెరిగిపోని చిరునామా’ నాటిక తల్లి–కుమారుడి భావోద్వేగాలను హృద్యంగా చూపించింది. నేరెళ్ల వేణుమాధవ్ స్మృత్యర్థంగా పేరడి గురుస్వామి మిమిక్రీ ప్రదర్శన ఆకట్టుకుంది. చివరిగా మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటిక కుటుంబ వ్యవస్థలోని సంఘర్షణలను ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో సహృదయ కార్యవర్గ సభ్యులు జి. గిరిజామనోహరబాబు, ఎన్వీఎన్ చారి, కుందావజ్జుల కృష్ణమూర్తి, మల్యాల మనోహరబాబు, న్యాలకొండ భాస్కర్‌రావు, లక్ష్మణమూర్తి, విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపదటిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న, కవి రామాచంద్రమౌళి, రంగస్థల సంస్థల నిర్వహకులు ఆకుల సదానందం, రమేష్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక సదస్సులు


