ఆటోను ఢీకొన్న లారీ
● ఒకరి మృతి
చిల్పూరు : మండలంలోని నష్కల్ గ్రామ బస్ స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద గురువారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కాజీపేట బాపూజీ నగర్‌కు చెందిన గబ్బెట ఎల్లేష్ (45), ఎర్ర రాజు ఆటోలో కరుణాపురం చర్చికి వచ్చారు. తిరిగి అదే ఆటోలో అర్ధరాత్రి నష్కల్ స్టేజీ సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వస్తున్న లారీ, ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎల్లేష్ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
లారీ ఢీకొని యువకుడు..
కమలాపూర్ : మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. శాయంపేట మండలం గట్ల కానిపర్తికి చెందిన కూనూరి రాజు (30) హుజూరాబాద్ వైపు నుంచి కమలాపూర్ వైపునకు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. కమలాపూర్ బస్టాండ్ వద్ద అదే వైపు వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ రాజు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు లారీ కింద పడగా తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో రాజును వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజు మృతి చెందాడని ధ్రువీకరించారు.
బావిలో పడి యువతి..
గూడూరు : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువతి మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని తేజావత్ రాంసింగ్ తండా శివారు దొడ్డితండాలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దొడ్డితండాకు చెందిన గుగులోత్ అఖిల (18) పదోతరగతి వరకు చదివి ఇంటి వద్ద తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహకరిస్తుంది. ఈ క్రమంలో మేకలను మేపడానికి వెళ్లిన అఖిల, వ్యవసాయబావి వద్ద మేస్తున్న మేకలను పక్కకు కొట్టబోయి, ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. తండ్రి గుగులోత్ సూర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.
ఆటోను ఢీకొన్న లారీ
ఆటోను ఢీకొన్న లారీ


