పెరుగుతున్న మంత్రుల ఆస్తులు
● బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ ప్రభాకర్
హన్మకొండ : రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తగ్గి.. మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దోచుకోవడం..దాచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు ఒక్కటేనని విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటేనే కమీషన్లు, కరప్షన్, కాంట్రాక్టులని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్‌లో కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ అంటోందని, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో సలహాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు ఆర్.పి.జయంత్‌లాల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు, సండ్ర మధు, కేతిపల్లి సంపత్ రెడ్డి, కురిమిండ్ల సదానందం, అరణ్య రెడ్డి, మల్లికార్జున్, అభిషేక్ పాల్గొన్నారు.


