కమ్మేసిన మంచు.. కనిపించని రోడ్డు
● ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు
ఖిలా వరంగల్ : వరంగల్ నగర రహదారులను శుక్రవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 10గంటల వరకు రహదారులపై దట్టంగా మంచు పడుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుడికి వెళ్లొస్తామని బయల్దేరి..
వరంగల్ రంగశాయిపేటకు చెందిన దంపతులు గుడికి వెళ్లొస్తామని ఇంటినుంచి బయల్దేరారు. ఇంతలో రోడ్డును కమ్మేసిన పొగ మంచు వారి ప్రాణాల మీదకు తెచ్చింది. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగశాయిపేటకు చెందిన గడ్డం రఘుమోహన్, రాజేశ్వరి బైక్‌పై భద్రకాళి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. పొగమంచు వల్ల రోడ్డు కనిపించే పరిస్థితి లేదు. ఫోర్ట్ రోడ్డులోని వాల్‌మార్ట్ సమీపానికి చేరుగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దాని వెనుకలే వెళ్తున్న వీరు ట్రాక్టర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘనటలో ఇద్దరి తలతో పాటు ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన మిల్స్‌కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల వివరాలు సేకరించినట్లు సమాచారం.


