పులి పయనం ఎటు వైపు?
కొత్తగూడ: పులి అడుగులు రోజు ఓ చోట కనిస్తుండడంతో ఆ జంతువు పయనం ఎటు వైపునకు సాగిందని అధికారులు అంచనాకు రాలేక పోతున్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి బీట్ పరిధిలోని రేణ్యతండా సమీప అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా పులి పయనాన్ని అంచనా వేయడం కోసం ఎఫ్‌డీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రేంజ్ అధికారులు అడవుల్లో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో పూనుగొండ్ల సెక్షన్ పరిధిలో కర్నె గండి అటవీ ప్రాంతంలో గురువారం పాదముద్రలు గుర్తించారు. దీంతో కర్నెగండి నుంచి రేణ్యతండా వైపుకు వెళ్లిందా..? లేక రేణ్యతండా నుంచి కర్నెగండి వైపునకు వచ్చిందా? అనే అంశం నిర్ధారించలేకపోతున్నారు.
ఆరు నెలలుగా ఇక్కడే ఉందా?
ఆరు నెలలుగా ఓటాయి, పూనుగొండ్ల సెక్షన్ పరిధి అటవీ ప్రాంతంలోనే పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ఈ అడవిలో సంబంధిత అధికారులు జూపార్కుల్లో ఉన్న వన్య ప్రాణులను వదిలారు. ఈ వన్య ప్రాణులను వేటాడడం పులికి సులభమవుతుందని, సరిపోను ఆహారం లభించడంతో ఇక్కడే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆందోళన వద్దు.. జాగ్రత్తగా ఉండాలి
అటవీ గ్రామాల ప్రజలు పులి సంచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే జాగ్రత్తగా ఉండాలి. అడవిలోకి సాదు జంతువులను మేతకు తీసుకెళ్లొద్దు. అలాగే, ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దు. పులి సంచారం గమనించినా.. జంతువులను వేటాడినట్లు గుర్తించినా వెంటనే సమాచారం అందించాలి.
–చంద్రశేఖర్, ఎఫ్‌డీఓ
అంతుచిక్కని టైగర్ సంచారం..
అడవులను జల్లెడ పడుతున్న అధికారులు
పూనుగొండ్ల బీట్ పరిధిలో
పులి అడుగులు గుర్తింపు


