సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్ తొలగిస్తాం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్ నుంచి పేరు తొలగిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లతోపాటు అనుమానుతులపై ఉన్న షీట్లను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు పత్రాలను అందజేశారు. సత్ప్రవర్తనతో జీవిస్తున్నారని ఉన్నతాధికారులు గుర్తించిన 19 మందిలో 5గురు రౌడీ షీటర్లు, 12 మంది అనుమానితులు, ఒకరు కేడీ, ఒకరు డీసీని రౌడీ షీట్ల నుంచి పేర్లను తొలగిస్తూ సీపీ ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం ఎలాంటి జీవితం గడుపుతున్నారని రౌడీ షీటర్లను అడిగి తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడడంతో మీపై రౌడీ షీట్లను ఓపెన్ చేశామని, ప్రస్తుతం మీ ప్రవర్తన బాగుందని విచారించిన అనంతరం షీట్లను తొలగించామని, భవిష్యత్‌లో ఇలాగే జీవించాలన్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్‌రాజు, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్, మల్లయ్య పాల్గొన్నారు.


