శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
● మానుకోట చుట్టూ ఐదు జాతీయ రహదారులు
● ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన రెండు ఎన్‌హెచ్‌లు
● కొనసాగుతున్న మూడు రహదారుల పనులు
● పూర్తయితే ప్రధాన పట్టణాలకు ప్రయాణం సులభం
రహదారుల
వలయం
సాక్షి, మహబూబాబాద్:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ పట్టణం ఏటేటా విస్తరిస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రంగా మారిన మానుకోట చుట్టూరా ఇప్పుడు ఐదు జాతీయ రహదారుల వలయం ఏర్పడుతోంది. ఈ రహదారులు దేశంలోనే ప్రధాన పట్టణాలతో అనుసంధానం అవుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రయాణం సులభతరం అవుతుంది. నూతన సంవత్సరంలో పనులు పూర్తయి రహదారులన్నీ అందుబాటులోకి రావాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
జిల్లా నుంచి వెళ్తున్న ఐదు జాతీయ
రహదారులు..
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్, తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు వారధిగా ఉన్న మహబూబాబాద్ జిల్లా మీదుగా ఐదు జాతీయ రహదారులు వెళ్తాయి. హైదరాబాద్ నుంచి నకిరేకల్ మీదుగా జిల్లాలోని మరిపెడ ప్రాంతంలో పారంభమయ్యే 365 జాతీయ రహదారి జిల్లా కేంద్రం నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట మీదుగా ములుగు జిల్లాలోని మల్లంపల్లికి వెళ్తోంది. ఈ రహదారి అందుబాటులో ఉంది. జగిత్యాల నుంచి కరీంనగర్, వరంగల్ మీదుగా జిల్లాలోని తొర్రూరులో ప్రారంభమయ్యే 563 జాతీయ రహదారి మరిపెడ నుంచి ఖమ్మం జిల్లాలోని మరో జాతీయ రహదారికి అనుసంధానం అవుతుంది. ఇక హైదరాబాద్ గౌరవల్లి నుంచి జిల్లాలోని పెద్దవంగరలో ప్రారంభమయ్యే 930–పీ జాతీయ రహదారి జిల్లాలోని తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, బయ్యారం మీదుగా ఇల్లెందు, భద్రాద్రికొత్తగూడెం వెళ్తుంది. ఈ రహదారి పనులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కోదాడ మీదుగా వచ్చే 365–ఏఏ జాతీయ రహదారి ఖమ్మం జిల్లా మీదుగా జిల్లాలోని సీరోలు మండలంలో ప్రారంభమై.. కురవి మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారి–365తో అనుసంధానం అవుతుంది. ఈ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. అదే విధంగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే 163–జీ నాగ్‌పూర్ నుంచి జిల్లా మీదుగా విజయవాడ ద్వారా చైన్నె హైవేకు అనుసంధానం అవుతుంది. ఈ రోడ్డు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన మార్గం వెళ్తున్న మానుకోట జిల్లాకు అందుబాటులో ఉన్న రెండు జాతీయ రహదారులతో పాటు.. నిర్మాణంలో ఉన్న మూడు జాతీయ రహదారులు పూర్తి అయితే ప్రధాన పట్టణాలకు ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రధానంగా జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, చైన్నెతో పాటు తిరుపతి, వేములవాడ, భద్రాచలం పుణ్యక్షేత్రాలకు ప్రయాణం సులభం అవుతుంది. అదే విధంగా జిల్లాలో పండించే తేజా రకం మిర్చి, పసుపు, సన్నరకం ధాన్యం, డిజైనింగ్ టైల్స్ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం, ఇతర ప్రాంతాల్లోని సరుకుల జిల్లాకు దిగుమతి చేసుకోవడం సులభం అవుతుంది.
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026


