చేతులెత్తేసిన కాంట్రాక్టర్..
● రెండున్నర నెలలుగా కోడి గుడ్లకు
దూరమైన అంగన్‌వాడీ పిల్లలు
● బ్లాక్ లిస్ట్‌లో కాంట్రాక్టర్ పేరు
● ఎట్టకేలకు మళ్లీ టెండర్ ప్రకటన
మహబూబాబాద్: గతంలో శాఖల వారీగా కోడిగుడ్ల సరఫరాకు టెండర్ ప్రక్రియ ఉండేది. అయితే ప్రస్తుతం ఇంటిగ్రేడ్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మొత్తానికి గుడ్ల సరఫరా కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆరుగురు దరఖాస్తు చేసుకోగా.. వారిలో ఎల్‌వన్‌లో గుడ్డు ధర రూ.5.33కు టెండర్ చేసిన జేబీ పౌల్ట్రీఫాం యజమానికి ఆమోదం తెలిపారు. అయితే ఆ ధరకు సరఫరా సాధ్యం కాదని సదరు కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. దీంతో అధికారులు ఆ కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకున్నారు. కాగా టెండర్ ప్ర క్రియ మధ్యలో నిలిచిపోవడంతో అంగన్‌వాడీ పిల్ల లు రెండున్నర నెలలుగా గుడ్డుకు దూరమయ్యారు.
జిల్లాలో 1,435 అంగన్‌వాడీ కేంద్రాలు..
జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,435 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లులు 3,604మంది, ఏడు నెల నుంచి మూడుసంవత్సరాల లోపు పిల్లలు 20,295 మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 16,181 మంది ఉన్నారు. ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలకు (టీహెచ్‌ఆర్ కింద) నెలకు 16 గుడ్లు, మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతీ నెల 25 గుడ్లు, గర్బిణులు, బాలింతలకు కూడా ప్రతీ నెల 25చొపున కోడి గుడ్లు ఇస్తున్నారు.
రెండున్నర నెలలుగా బంద్..
ప్రతీ నెల అంగన్‌వాడీ కేంద్రాలకు 2,50,000 గుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేసేవారు. పాత కాంట్రాక్టర్ సరఫరా గడువు జూలై 2025తో ముగిసింది. అయితే, తన గడువు పెంచడంతో ఈఏడాది అక్టోబర్ 15 వరకు గుడ్ల సరఫరా చేశారు. ఆ తర్వాత నుంచి రెండున్నర నెలలుగా సరఫరా లేక పిల్లలు గుడ్డుకు దూరమయ్యారు.
ఇంటిగ్రేడ్ కాంట్రాక్టర్ విధానం ప్రకారం
టెండర్..
టెండర్ ప్రాసెస్‌కోసం సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఈఓ, డీడబ్ల్యూఓ, మైనార్టీశాఖ అధికారి, డీటీడీఓ అధికారులు ఉన్నారు. కాగా, గత ఏడాది జూలైలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి అదే నెల 30నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చారు. కోళ్ల ఫాంల యజమానులు ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం అదే నెల 13వ తేదీ నుంచి డాక్యుమెంట్‌ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు.
ఎట్టకేలకు టెండర్ పూర్తి..
ఎట్టకేలకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆరుగురు పౌల్ట్రీ ఫాం యజమానులు టెండర్ వేశారు. ఇందులో జేబీ పౌల్ట్రీఫాం యజమాని తన టెండర్‌లో ధర రూ 5.33 కు గుడ్డు సరఫరా చేస్తానని కోట్ చేశారు. దీంతో అధికారులు ఆయన టెండర్‌ను ఆమోదించారు. ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత సదరు కాంట్రాక్టర్ ఆ ధరకు కోడి గుడ్లు సరఫరా చేయలేనని చేతులెత్తేశాడు. దీంతో ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సమస్య తలెత్తి గుడ్ల సరఫరా కావడం లేదు. మిగిలిన వాటికి తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి సరఫరా చేస్తున్నారు. కాగా స దరు కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఈఎండీ రూ.10లక్షలు ఆయనకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.
కమిటీకి తలనొప్పి..
కోడిగుడ్ల సరఫరా కమిటీకి తలనొప్పిగా మారింది. దీంతో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. కాగా టెండర్ ప్రక్రియ జరిగితేనే అంగన్‌వాడీ పిల ్లలకు గుడ్ల సరఫరా జరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు నెలరోజుల సమయం పడుతుంది. ఆలోపు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
టెండర్ ప్రకటన విడుదల..
ఎట్టకేలకు డిసెంబర్ 31(బుధవారం)న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున జిల్లా కొనుగోలు కమిటీ ఆధ్వర్యంలో గుడ్ల సరఫరా ఇ–టెండర్ విడుదల చేశారు. జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠఽశాలలు, కళాశాలలకు కోడిగుడ్ల సరఫరా టెండర్ ప్రకటన విడుదల చే శారు. పౌల్ట్రీ ఫాం యజమానులు దరఖాస్తు చేసుకోవాలని ఆ టెండర్‌లో ఉంది. దాని ప్రకారం ప్రాసెస్ ఫీజు రూ.10,000, ఈఎండీ కింద రూ.9,96,363 డీడీ ఇవ్వాల్సి ఉంది.


