పంటలు నమోదు చేయించుకోవాలి
గూడూరు: రైతులు తమ పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని డీఏఓ విజయనిర్మల అన్నారు. మండలంలోని బొల్లెపల్లిలో మంగళవారం పంటల నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి రైతుల పంటలు నమోదు చేయాలని సూచించారు. అదే విధంగా కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్‌మాలిక్, ఏఈఓ వినయ్ పాల్గొన్నారు.
ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
మహబూబాబాద్ రూరల్: వివాదాలు పెంచుకుంటే జీవితకాలం కొనసాగుతాయని, కలిసిపోదామని ఒక నిర్ణయానికి వస్తే వివాదాలు ముగుస్తాయని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ.. ఉచిత న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లా కోర్టులో మెగా స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తారని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివాదాస్పద కేసుల విషయంలో కోర్టుకు హాజరై రాజీ చేసుకుంటే ఆ కేసులు పూర్తిగా తొలగిస్తారని పేర్కొన్నారు. వాహన ప్రమాద కేసులు, కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్నచిన్న దొంగతనాల కేసులు, ఇతర రాజీ చేయదగిన కేసులను మెగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తారని తెలిపారు. ఫిర్యాదుదారుడు, నిందితుడు ఇద్దరు తమ ఆధార్ కార్డు తీసుకుని మహబూబాబాద్ కోర్టుకు హాజరుకావాలని కోరారు. పూర్తి సమాచారం కోసం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
ఎమ్మెల్యే చెప్పినా
పట్టింపులేదు
● ఉపాధ్యాయుల బదిలీలపై చర్యలేవి
● అనంతారం మోడల్ స్కూల్‌లో మళ్లీ గొడవలు!
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపం, తరచూ గొడవల వల్ల విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. ఈమేరకు పదిరోజుల క్రితం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ వెంటనే స్పందించి మోడల్ స్కూల్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులను పట్టించుకోని, సమన్వయ లోపం ఉన్న ఉపాధ్యాయులను బదిలీ చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మళ్లీ ఉపాధ్యాయుల మధ్య అంతర్గతంగా చిన్నచిన్న గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులపై బదిలీ చర్యలు తీసుకుంటేనే స్కూల్‌లో చదువులు సాఫీగా సాగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పంటలు నమోదు చేయించుకోవాలి


