చెరువుకు చేప..
నెహ్రూసెంటర్: జిల్లాలోని చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 1,229 చెరువుల్లో 4.20 కోట్ల చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం అనుమతించగా మత్స్యశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈమేరకు నేటి నుంచి చేప పిల్లలను చెరువుల్లో పోయనున్నారు. గతేడాది 50శాతం చేప పిల్లలను మాత్రమే చెరువుల్లో వదలగా.. ప్రస్తుతం 4.20 కోట్ల పిల్లలను పోయనున్నారు. అయితే ఆలస్యంగా చేప పిల్లలను వదులుతున్నారని, ఆశించిన మేర ఎదగవని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని 1,229 చెరువుల్లో..
జిల్లాలోని 1,229 చెరువుల్లో 4.20 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆయా చెరువుల విస్తీర్ణం ఆధారంగా చిన్న చెరువుల్లో 35–40ఎంఎం సైజు 2.02 కోట్ల చేప పిల్లలు, పెద్ద చెరువుల్లో 80–100 ఎంఎం సైజు 2.20 కోట్ల వివిధ రకాల చేప పిల్లలను వదలనున్నారు. జిల్లాలో 205 మత్స్యశాఖ సొసైటీలు ఉండగా.. చేప పిల్లల పంపిణీ ద్వారా సుమారు 15,437 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా ఏడాదంతా ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా వేలాదిమందికి జీవనాధారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం అనుమతించగా చెరువుల్లో వదిలేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాం. జిల్లాలోని అన్ని చెరువుల్లో త్వరలోనే పంపిణీ పూర్తి చేస్తాం. మత్స్యకారులు సద్వి నియోగం చేసుకోవాలి.
– శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి
1,229 చెరువుల్లో 4.20కోట్ల చేప పిల్లలు పోయడమే లక్ష్యం
నేటి నుంచి పంపిణీ షురూ..
జిల్లాలో 205 మత్స్య సొసైటీలు,
15,437 మంది సభ్యులు
చెరువుకు చేప..


