నేడు కార్తీక పౌర్ణమి
● పట్టణంలో కొనుగోళ్ల సందడి
మహబూబాబాద్ రూరల్ : శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం భక్తులు ‘కార్తీక పౌర్ణమి’ వేడుకలను ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈమేరకు జిల్లాలోని పలు శైవక్షేత్రాలు, ఇతర ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆయా ఆలయాల్లో శివలింగాలకు లఘున్యాసపూర్వక, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహి స్తామని అర్చకులు తెలిపారు. దీపాలతో జ్యోతిర్లింగార్చనలు, జ్వాలాతోరణం పూజలు, శివపార్వతుల కల్యాణ వేడుకలు జరుగుతాయన్నారు. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే అన్ని రకాల దోషాలు తొలిగి శుభం చేకూరుతుందని తెలిపారు.
ఉసిరి, దీపాంతల కొనుగోలు..
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సంప్రదాయం ప్రకారం భక్తులు తమ ఇళ్ల వద్ద, ఆలయాల్లో ఉసిరి కొమ్మలు, ఉసిరికాయలతో దీపాలు వెలిగిస్తారు. కాగా భక్తులు మానుకోట పట్టణంలో ఉసిరి కొమ్మలు, కాయలు, దీపాంతలు, ఒత్తుల కట్టలు కొనుగోలు చేస్తూ కనిపించారు.


