90 రోజుల్లో జాతర అభివృద్ధి పనులు | - | Sakshi
Sakshi News home page

90 రోజుల్లో జాతర అభివృద్ధి పనులు

Oct 14 2025 7:35 AM | Updated on Oct 14 2025 7:35 AM

90 రోజుల్లో జాతర అభివృద్ధి పనులు

90 రోజుల్లో జాతర అభివృద్ధి పనులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను 90 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం మేడారంలోని హోటల్‌ హరితలో మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మేడారం మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో తల్లుల గద్దెల పునరుద్ధరణ, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేడారం ప్రాంతాన్ని శాశ్వతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గద్దెల ప్రాంగణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.101 కోట్లు మంజూరు చేసిందని, మరో రూ. 71 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జంపన్నవాగుకు ఇరువైపులా పది వేల మంది సేదదీరేందుకు షెడ్ల్లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేడారంలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి పొంగులేటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సకాలంలో పనులను పూర్తిచేయాలని సూచించారు. గతంలో జంపన్న వాగుపై వంతెన నిర్మాణం కేవలం 45 రోజుల్లో పూర్తయిందని, అదే మాదిరి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీ పోరిక బలరాం నాయక్‌ అన్నారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎంపీ బలరాంనాయక్‌, కలెక్టర్‌ దివాకర, ఎస్పీ శబరీశ్‌.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. కాగా, మంత్రులు పొంగులేటి, సీతక్కను పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు అమ్మవార్ల వస్త్రాలతో సన్మానించి ప్రసాదం అందజేశారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ రాహూల్‌ కిషన్‌ జాదవ్‌, అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవి చందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేష్‌, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం ఈఓ వీరస్వామి పాల్గొన్నారు.

అన్ని హంగులతో గద్దెల ప్రాంగణాన్ని ఆధునికీకరిస్తాం

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ములుగు: మేడారం సమ్మక్క, సారక్క జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా సోమవారం మేడారంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క.. అధికారులతో నిర్వహించిన సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. సొంత శాఖకు చెందిన మంత్రి లేకుండానే సమీక్ష సమావేశం కొనసాగడం చర్చనీయాంశమైంది. 2026 జనవరి 28 నుంచి జరిగే మహాజాతరకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. అయితే తనకు తెలియకుండానే అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారని, దేవాదాయ శాఖ పనుల్లో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి పాత్ర ఏంటని మంత్రి సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. మేడారంలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటనకు, సమీక్ష సమావేశానికి మంత్రి సురేఖ హాజరుకాకపోవడం విభేదాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. కాగా, ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు రావడంతో సకాలంలో మేడారం పనులు పూర్తయ్యేనా అని పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement