
రిమాండ్ ఖైదీ మల్లేశ్ పోస్టుమార్టం వాయిదా
జనగామ/దేవరుప్పుల : ఓ కేసులో రిమాండ్ ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారాల మల్లేశ్ అనే వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విధితమే. అయితే అతడి మృతిపై నిగ్గు తేల్చే ప్రత్యేక పోస్టుమార్టం సోమవారం జరగాల్సి ఉండగా ఆ ప్రక్రియ మంగళవారానికి వాయిదా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో గత నెల 23వ తేదీన పడకంటి బ్రహ్మచారి అనే వ్యక్తిని ఇదే గ్రామానికి చెందిన వారాల మల్లేశ్ కర్రతో కొట్టడంతో అతడి చేయి విరిగింది. ఈ విషయమై బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 8వ తేదీన మల్లయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా జనగామ సబ్‌జైలుకు రిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శనివారం జైలు మూత్రశాలకు వెళ్లిన మల్లేశ్ అక్కడ బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ వరంగల్‌లో మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి కుటుంబ సభ్యులు సబ్‌జైలు ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్‌హెచ్‌ఆర్‌ఎ పర్యవేక్షణలో సముచిత న్యాయం చేస్తుందన్న భరోసాతో ఆందోళన విరమించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంలో భద్రపర్చారు. కాగా సోమవారం జనగామ కోర్టు ఫస్ట్‌క్లాస్ సివిల్ జూనియర్ జడ్జి శశి ఎంజీఎంను సందర్శించి తదుపరి చర్యలపై సమీక్షించారు. జైలు కస్టడీలో ఉన్న మల్లయ్య మృతిపై సమగ్ర విచారణ కోసం ఉన్నతస్థాయి వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం చేయాల్సి ఉంది. అయితే ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల సీనియర్ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో కేఎంసీ ప్రొఫెసర్లు పోస్టుమార్టం చేయాలనే నిబంధనలతో మంగళవారానికి వాయిదా పడింది.
మల్లేశ్ మృతిపై అనుమానాలు..
ఓ సాధారణ కేసులో ఏకంగా రిమాండ్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందడమేగాక జైలుకెళ్లిన ఆయన కు కౌన్సెలింగ్ లోపం కూడా మల్లేశ్ ఆత్మహత్యాయత్నానికి దారి తీసిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జైలుకెళ్లే క్రమంలో మానసిక ఒత్తిళ్లకు గురయ్యే నిందితులపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. నిందితులు ఆత్మహత్యలకు పాల్పడే వనరులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మల్లేశ్ ప్రమాదకరం కానీ బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యకు యత్నించారంటే నమ్మశక్యంగా లేదని పలువురు పేర్కొంటున్నారు. ఒక వేళ తాగి అపస్మారక పరిస్థితిలోకి వెళ్లిన ఆయనను మధ్యాహ్నం 12 గంటలకు జనగామ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారని, అయితే మెరుగైన వైద్యం అందించడంతో యంత్రాంగం వైఫల్యం పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మృతుడి భార్య హైమా న్యాయ పో రాటానికి గ్రామస్తులు, ప్రజాసంఘాలు బాసటగా నిలుస్తున్న క్రమంలో అంత్యక్రియలు జరిగే వరకూ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముంద చూపుతో పోలీసు యంత్రాంగం జనగామ సబ్‌జైలు, సింగరాజుపల్లిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఎంజీఎంను సందర్శించిన జనగామ కోర్టు ఫస్ట్‌క్లాస్ సివిల్ జూనియర్ జడ్జి