
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
ఎంజీఎం : కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాద నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు, పీఆర్‌ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి 6 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇటీవల కేఎంసీ ప్రిన్సిపాల్, ఎంజీఎం సూపరిండెంట్‌లకు వినతులు అందజేశామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల16 నుంచి దశల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఆస్పత్రి సిబ్బంది శోభ, సంధ్య, భానురేఖ, విక్రమ్, కోమల, రేష్మ, లావణ్య, మౌనిక, స్రవంతి, హిమబిందు,శ్రావణి తదితరులు పాల్గొన్నారు.