
వ్యసనాలకు దూరంగా ఉండాలి
వరంగల్ స్పోర్ట్స్: విద్యార్థులు మొబైల్ ఫోన్లు, మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆర్‌జేడీ ఎ. గోపాల్ అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతల అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు విద్య, క్రీడలు రెండు దోహదపడుతాయన్నారు. మూడు రోజుల పాటు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–19 కబడ్డీ పోటీల్లో బాలుర జట్టు విజేతగా నిలవగా, బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఖ్యాతిని నిలబెట్టిన కబడ్డీ క్రీడాకారులను అభినందించారు. ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఐఈఓ శ్రీధర్‌సుమన్, సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాధవరావు, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమన్యాలు సత్యనారాయణ రెడ్డి, మూగల కుమార్‌యాదవ్, కొత్త కృష్ణారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు బరుపాటి గోపి, కోట సతీశ్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి దరిగె కుమార్, తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ బాధ్యడు మర్కాల యాదిరెడ్డి, డీఎస్‌ఏ కోచ్‌లు జీవన్‌గౌడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌జేడీ ఎ. గోపాల్
రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతలకు
అభినందన సభ