
తూతూమంత్రంగా క్రీడా పోటీలు
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు ఆటల్లో రాణించాలంటే సరైన ప్రోత్సాహం ఉండాలి. అప్పుడే గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగి ప్రతిభ చూపేందుకు ఆస్కారం ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వం ఏటా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. కాగా కరోనా కారణంగా మూడేళ్ల పాటు విద్యార్థులు క్రీడా ఎంపిక పోటీలకు దూరమయ్యారు. అయితే 2023–24 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయి క్రీడల నిర్వహణలో ఎస్‌జీఎఫ్ కమిటీ సభ్యులు, పీడీలు పూర్తిగా విఫలం చెందారు. తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు పాఠశాల స్థాయిలో కూడా క్రీడా పోటీలు నిర్వహించలేదు.
క్యాలెండర్ ప్రకారం క్రీడల
నిర్వహణలో విఫలం..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్యాలెండర్ ప్రకారం క్రీడల నిర్వహణలో విఫలమవుతున్నారు. జిల్లాలో 102 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. 15,497 మంది చదువుతున్నారు. అలాగే ఎనిమిది మోడల్ స్కూళ్లలో 4,749 మంది విద్యార్థులు, 16 కేజీబీవీల్లో 3,243 మంది, ఆరు సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో 3,055మంది, ఐదు ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 2,898 మంది, ఏడు బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 3,569 మంది, ఐదు మైనార్టీ గురుకులాల్లో 1,108 మంది, ఐదు ట్రైబల్ ఈఎంఆర్‌ఎస్ గురుకులాల్లో 1,978 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ 17,19 విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తారు. కాగా, విద్యార్థులకు ఆగస్టు మొదటి, రెండో వారం వరకు మండల స్థాయిలో క్రీడా ఎంపిక పోటీలు పూర్తి చేయాలి. ఆగస్టు మూడోవారంలో జోనల్ స్థాయి, సెప్టెంబర్ రెండోవారంలో జిల్లా స్థాయిలో పూర్తి చేయాలి. సెప్టెంబర్ నాలుగో వారంలో రాష్ట్రస్థాయిలో పూర్తి చేసి, జాతీయ స్థాయి పోటీలకు పంపించాలి. అయితే అక్టోబర్ రెండో వారం గడుస్తున్నా ఎస్‌జీఎఫ్ పాఠశాల స్థాయి క్రీడలు నిర్వహించడం లేదు. దీంతో క్రీడాకారులు క్రీడలపై పట్టు కోల్పోతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణించలేకపోతున్నారు. ఎస్‌జీ ఎఫ్ కమిటీ సభ్యులు, జిల్లాలోని పీడీల నిర్లక్ష్యం వల్లే క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించడం లేదని, ఒకవేళ నిర్వహిస్తే తూతూమంత్రంగా చేపడుతున్నారని పలువురు సీనియర్ క్రీడాకారులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి క్యాలెండర్ ప్రకారం పాఠశాల స్థాయిలో ఎస్‌జీఎఫ్ క్రీడలు నిర్వహించాలని తల్లిదండ్రులు, సీనియర్ క్రీడాకారులు కోరుకుంటున్నారు.
పాఠశాల స్థాయి నుంచి
క్రీడా ఎంపికలు నిర్వహించాలి
క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాయి. పీడీలు పీఈటీలు విద్యార్థులకు పాఠశాల స్థాయినుంచే క్రీడా ఎంపికలు నిర్వహించాలి. ప్రస్తుతం జిల్లాలో ఎంపికలు నిర్వహించకుండానే నేరుగా జిల్లా స్థాయికి పాత క్రీడాకారులను తీసుకువచ్చి పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లా క్రీడాకారులకు సాధన లేక వెనుకబడి పోతున్నారు. నూతన విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తే జాతీయస్థాయిలో రాణిస్తారు.
– పద్మావతి, రిటైర్డ్ పీడీ, మానుకోట
●
ఎస్‌జీఎఫ్ క్రీడా ఎంపిక పోటీల
నిర్వహణలో నిర్లక్ష్యం
ఈ విద్యా సంవత్సరంలో
ఇప్పటి వరకు ఊసేలేదు
పాఠశాల, మండల, జోనల్‌స్థాయిలో పోటీలు కరువు
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

తూతూమంత్రంగా క్రీడా పోటీలు