
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
● పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక
● ఏఐసీసీ పరిశీలకుడు
దెబాసిస్ పట్నాయక్ జీ
మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు దెబాసిస్ పట్నాయక్ జీ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం నిర్వహించి, ఆశావహుల నుంచి దరఖాస్తులు, పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా దెబాసిస్ పట్నాయక్ జీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రమించి బీఆర్‌ఎస్ అవీనితి, కుటుంబ పాలనను తరిమికొట్టారన్నారు. సామాజిక న్యాయం పాటించి, ఆశావహుల పేర్లను ఢిల్లీకి పంపిస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే వారికి పదవులు దక్కుతాయని, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ కోసమే తాము ఇక్కడికి వచ్చామని వెల్లడించారు. పారదర్శకంగా, నిస్పక్షపాతంగా, ప్రజాస్వామ్యయుతంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఎన్నికై న డీసీసీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని సూచించారు. సమావేశంలో టీపీసీసీ పరిశీలకులు ఇందిరారావు, అవేజ్, శ్రీకాంత్, అరుణ్ కుమార్, షాద్‌నగర్, మానుకోట ఎమ్మెల్యేలు శంకర్, మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్నయాదవ్, నాయకులు ఘనపురపు అంజయ్య, గుగులోత్ దస్రునాయక్, అజ్మీరా సురేష్ తదితరులు పాల్గొన్నారు.