
పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి
● వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్
ఆర్.ఉమారెడ్డి
మహబూబాబాద్ రూరల్ : పంటల సరళీకరణ, పంట మార్పిడిపై రైతులకు కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాలని వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ ఆర్.ఉమారెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. కేవీకేలో నిర్వహిస్తున్న వివిధ శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, క్షేత్ర దినోత్సవాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణం, పత్తిలో సగటు దిగుబడి, మిరప సాగు తగ్గడానికి కారణాలు, వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి, వివిధ నూనె, పప్పు దినుసు పంటల సాగు వివరాలు అడిగి, జిల్లాలో సాగవుతున్న పంటల పరిస్థితులను గురించి ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు అంతర పంటల సాగు, పంట అవశేషాలను కలియదున్నడం, జీవన, రసాయన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. యాసంగిలో నాణ్యమైన విత్తనంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్శనలో మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ దిలీప్ కుమార్, శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.