
దూది రైతు దిగాలు
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
మహబూబాబాద్ రూరల్ : అధిక వర్షాలు రైతన్నలను తీవ్రంగా వేధిస్తున్నాయి. జిల్లాలో కురిసిన వర్షాలతో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. పూత, కాత రాలిపోతుండగా.. కాయలు పగిలిన పత్తి మసకబారిపోతోంది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 85,270 ఎకరాల్లో పంట సాగు చేయగా.. సుమారు 30 నుంచి 35 వేల ఎకరాల్లో పంటకు నష్టం చేకూరినట్లు సమాచారం.
85,270 ఎకరాల్లో సాగు
పత్తి పంట సాగు సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, అనంతరం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కర్షకులను నష్టాలకు గురిచేస్తున్నాయి. జిల్లాలో 85,270 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి పంట పూత, కాత రాలిపోవడంతో పాటు ఎర్రబారుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పు ల కారణంగా పత్తి చేలలో తేమ శాతం అధికమై, వర్షపు నీరు నిలిచి తీరని నష్టం జరుగుతోంది. ప్రస్తుతం పూసిన పత్తి అధిక వర్షాలతో నల్లబారుతోంది. కాగా, అధిక వర్షాలతో ఎకరాకు ఐదు క్వింటాళ్ల మేరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి ఎకరానికి రూ.45 వేల వరకు పెట్టుబడి పెట్టామని, అది కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
దీపావళికి అంతంత మాత్రమే..
ఏటా దసరా పండుగ వరకు కొత్త పత్తి మార్కెట్‌కు వస్తుంది. అయితే ప్రస్తుతం వర్షాల వల్ల చేలలో ఉన్న పత్తిని రైతులు ఏరలేకపోతున్నారు. వర్షాలు తగ్గితే పత్తిని ఏరి దీపావళి తర్వాత మార్కెట్‌కు తరలించే అవకాశం ఉంది. అదికూడా తక్కువ మొత్తంలోనే విక్రయానికి వచ్చేలా ఉందని మార్కెట్ అధికారులు భావిస్తున్నారు.
పత్తి
పంటను ఆశించిన తెగులు
అధిక వర్షాలతో పత్తి పంటకు నష్టం
జిల్లాలో 85,270 ఎకరాల్లో సాగు
చేలల్లో నిలిచిన వర్షపు నీటితో
ఎర్రబారుతున్న మొక్కలు
అధికంగా రాలుతున్న పూత, కాత
ఆందోళన చెందుతున్న కర్షకులు
రాలుతున్న పూత, కాత..
భారీ వర్షాల వల్ల భూమిలో తేమశాతం అధికం ఉండడంతో పత్తి పూత, కాత క్రమక్రమంగా రాలిపోతున్నాయి. పత్తి పంటకు రసం పీల్చే పురుగులు, ఆకుముడత, పండాకు తెగులు, తెల్ల దోమ, పచ్చ దోమ, నల్లి వంటి తెగుళ్లు అధికమయ్యాయి. పత్తి పూత, కాత పిందే రాలిపోవడంతో కాయలు పనికి రాకుండా తయారవుతున్నాయి. వ్యవసాయ అధికారులు, కేవీకే శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటలకు మందులు పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దూది రైతు దిగాలు

దూది రైతు దిగాలు